ఆరు గ్యారెంటీ పధకాలకు ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో రెండు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుని ఈ నెల 9 నుంచి అమలుచేస్తోంది. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాలని కాంగ్రెస్‌ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈరోజు జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలెండర్, మహిళలకు రూ.2,500 నగదు బదిలీ, పింఛన్ల పెంపు, ఇళ్ళ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్ధికసాయం, కొత్తరేషన్ కార్డుల కోసం అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించామని సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలియజేశారు. 

ముందుగా వీటి కోసం ప్రభుత్వం, పార్టీ తరపున కొందరు పరిశీలకులతో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. గ్రామసభ ఆమోదం పొందిన వారిని లబ్ధిదారులుగా గుర్తించి వారికి ఈ పధకాలను వర్తింపజేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియని పర్యవేక్షించేందుకు ఎక్కడికక్కడ నోడల్ అధికారులను నియమిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు.