భారత్-పాక్ దౌత్య సంబంధాలు కటీఫ్?

భారత్-పాక్ సరిహద్దుల వద్ద మళ్ళీ యుద్దవాతావరణం నెలకొన్న ఈ సమయంలో పాకిస్తాన్ లో పనిచేస్తున్న 8మంది భారత దౌత్యాదికారులని వారి కుటుంబాలతో సహా వెనక్కి తిరిగి వచ్చేయాలని విదేశాంగ శాఖ ఆదేశించడంతో, పాక్ పై భారత్ దాడికి సిద్దం అవుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

డిల్లీలో పాక్ హైకమీషన్ కార్యాలయంలో వీసా సెక్షన్ లో పనిచేస్తున్న మెహ్మముద్ అక్తర్ అనే ఉద్యోగి ఒకడు భారత్ లో గూడచర్యానికి పాల్పడుతూ పట్టుబడ్డాడు. మరో 6 మంది ఉద్యోగులు కూడా అతనికి సహకరిస్తున్నట్లు డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కనుగొన్నారు. దౌత్యపరమైన కస్టడీలో ఉన్న వారందరినీ పాక్ ప్రభుత్వం వెనక్కి రప్పించుకొంది. డిల్లీలో అక్తర్ ని దేశం విడిచి వెళ్ళిపోవాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే, ఇస్లామాబాద్ లో భారత్ హైకమీషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా పాక్ ప్రభుత్వం అటువంటి నిందే మోపి దేశ బహిష్కరణ చేసినట్లు ప్రకటించింది. వారితో సహా మరో ముగ్గురు దౌత్యవేత్తలని కూడా భారత్ వెనక్కి రప్పించుకోవాలని నిర్ణయించడంతో పాక్ తో దౌత్యపరంగా తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లయింది. 

వారి వ్యక్తిగత వివరాలు పాకిస్తాన్ లో బహిర్గతం కావడంతో వారి భద్రతకి భంగం కలుగుతుందనే భయంతో వెనక్కి రప్పించుకొంటున్నట్లు భారత్ చెపుతోంది. అది కూడా ఒక కారణం అయినప్పటికీ, పాక్ పై మళ్ళీ దాడికి వెనుకాడబోమని భారత్ హెచ్చరిస్తున్న కారణంగానే వారిని ముందు జాగ్రత్త చర్యగానే వెనక్కి రప్పించుకొంటోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనప్పటికీ ఇరుదేశాల దౌత్యాధికారులు వెనక్కి రప్పించుకోవడం భారత్-పాక్ దౌత్యపరంగా తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లుగానే భావించవచ్చు.