ప్రతిపక్షాల పగటి కలలు!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయనని కోమటిరెడ్డి శపథం చేస్తుంటారు. అంతవరకు గడ్డం గీయించుకోనని ఉత్తం కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది దానిని వాడేసుకొని అధికారంలోకి వచ్చేద్దామని సిపిఎం నేతలు కాళ్ళు నొప్పులు భరిస్తూ పాదయాత్రలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో తెరాసకి ఏకైక ప్రత్యామ్నాయం భాజపాయే...వచ్చే ఎన్నికలలో తెరాసని ఓడించేసి మేమే అధికారంలోకి వచ్చేయబోతున్నామని రాష్ట్ర భాజపా నేతలు కలవరిస్తుంటారు.

ఇక మిగిలింది తెదేపా. అది కూడా తనకి అనుకూలమైన థియరీని కనిపెట్టుకొని వచ్చే ఎన్నికలలో మేమే గ్యారంటీగా అధికారంలోకి వస్తామని చెపుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ థియరీని కనిపెట్టారు. అవకాశవాదులు, వలసవాదులతో నిండిపోయున్న తెరాస వచ్చే ఎన్నికలనాటికి ఖాళీ అయిపోతుందని కనుక వచ్చే ఎన్నికలలో తెదేపా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆయన ఇంకో బలమైన కారణం కూడా చెప్పారు. తెరాస సర్కార్ కొన్ని వర్గాలకి రాష్ట్ర సంపదనంతా దోచిపెడుతోందని కనుక ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని చెప్పారు.

ఈవిధంగా వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. కానీ తెరాస సర్కార్ కి కేంద్రప్రభుత్వం ఇస్తున్న సర్టిఫికేట్లే చాలు వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి!

ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని కేంద్రమంత్రులు వరకు అందరూ తెరాస సర్కార్ పాలన అద్భుతంగా ఉందని మెచ్చుకొంటుంటారు. ఇక దేశంలో నెంబర్: 1 ముఖ్యమంత్రి, నెంబర్: 1 రాష్ట్రం, నెంబర్: 2 ధనిక రాష్ట్రం వంటి రికార్డులు ఉండనే ఉన్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక విధానం చాలా బాగుందని పారిశ్రామికవేత్తలు కూడా శభాషీలు ఇస్తూనే ఉన్నారు. కనుక పగటి కలలు కంటున్న ప్రతిపక్షాలు వీటన్నటినీ కూడా లెక్కలోకి తీసుకొని తమ కలలని కాస్త అడ్జస్ట్ చేసుకొంటే మంచిదేమో?