తెదేపా ఎమ్మెల్యే, బీసి సంక్షేమ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యని ఈరోజు గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్లో సిట్ పోలీస్ అధికారి నాగిరెడ్డి ముందు హాజరయ్యి నయీంతో తన సంబంధాల గురించి అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పారు. ఇదివరకు నయీంతో తనకి సంబంధాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పుడు వాటిని ఖండించిన కృష్ణయ్య, ఈరోజు సుమారు గంటసేపు సాగిన విచారణలో సిట్ అధికారికి ఆయన చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు.
ఒకప్పుడు అంటే 1986లో తాను విద్యార్ధి సంఘాలకి నాయకత్వం వహిస్తున్న సమయంలో నయీం తనని గురువుగా భావించేవాడని కృష్ణయ్య చెప్పారు. ఆ సమయంలో నయీం తనని తరచూ కలుస్తుండేవాడని చెప్పారు. కానీ ఆ తరువాత క్రమంగా తాను బీసి సంఘాల ఉద్యమాల వైపుకి మళ్ళిపోయిన తరువాత నయీంని మళ్ళీ ఎన్నడూ కలవలేదని కృష్ణయ్య చెప్పారు. ఆ తరువాత నయీం సెటిల్మెంటులు, గూండాగిరి మొదలుపెట్టినట్లు వినడమే తప్ప ఏనాడూ అతనిని కలవలేదని కృష్ణయ్య చెప్పారు. తనకి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని కృష్ణయ్య మరోసారి పోలీసులకి స్పష్టం చేశారు.
నయీం తనని గురువుగా భావించేవాడని కృష్ణయ్య చెపుతున్నప్పుడు, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తన శిష్యుడిని వారించి ఉండి ఉంటే ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదేమో? సంఘంలో ఎంతో గౌరవం పొందుతున్న కృష్ణయ్యని ఈ కేసులో పోలీసులు ప్రశ్నించడమే అప్రదిష్ట అనుకొంటే, నయీం వంటి దుర్మార్గుడు తన శిష్యుడని చెప్పుకోవలసిరావడం ఇంకా అప్రదిష్టకరమైనది.