పవన్ కళ్యాణ్ కూడా జంప్?

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు తను అందరివాడినని చెప్పుకొన్నారు. కానీ తరువాత దానినే కొంచెం సరిచేసి నేను ఆంధ్రావాడినని సమైక్యరాగం ఆలపించారు. ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. ఆయన కూడా నేను అందరివాడినే అంటున్నారు. చంద్రబాబు స్టయిల్లో ఆంధ్రా, తెలంగాణా తనకి రెండు కళ్ళు అని కూడా చెపుతుంటారు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఆంధ్రాకి జంప్ అయిపోవడానికి సిద్దం అవుతున్నారు. అంటే ఆంధ్రాకి మకాం మార్చడం లేదు. తన ఓటు హక్కుని మాత్రమే మార్చుకోవాలనుకొంటున్నారు. పశ్చిమ గోదావరిలో ఏలూరులో ఓటరుగా తనపేరు నమోదు చేయించాలనుకొంటున్నారు. 

గత ఎన్నికల తరువాత అధికారికంగా రాష్ట్ర విభజన జరిగింది కనుక అప్పుడు హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న చంద్రబాబు నాయుడు, జగన్ వంటివారు ఆంధ్రాలో తమ స్వంత నియోజక వర్గాల నుంచి పోటీ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రెండూ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కనుక ఆంధ్రాలో పోటీ చేయదలచుకొనేవాళ్ళు వచ్చే ఎన్నికలలోగా తప్పనిసరిగా ఆంధ్రాలో ఓటర్లుగా తమ పేర్లని నమోదు చేయించుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో ఆంధ్రాలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ఇదివరకే ప్రకటించారు కనుక అందుకు వీలుగా ఆంధ్రాలో ఓటరుగా నమోదు చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ భావించడం సహజమే.