తెలంగాణా బంద్...ఎందుకు?

ఆంధ్రా-ఓడిశా సరిహద్దులో మల్కన్ గిరి జిల్లాలో 30 మంది మావోయిష్టులని ఆంధ్రా పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని నిరసిస్తూ నవంబర్ 3న తెలంగాణా బంద్ కి పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా నవంబర్ 3న తెలంగాణా బంద్ పాటించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్కౌంటర్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినప్పటికీ, ఇది ఆంధ్రాకి సంబంధించిన విషయం. ఇది ఏపి సర్కార్ నిర్ణయం వలన ఆంధ్రా-ఓడిశా సరిహద్దులో జరిగిన పరిణామం. అందుకే మావోలు ఏపి సర్కార్ పై ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరిస్తున్నారు. కనుక వారు ఏపి బంద్ కి పిలుపునిచ్చి ఉండిఉంటే అది సహజమని అందరూ భావించి ఉండేవారు. కానీ ఎన్కౌంటర్ కి నిరసనగా తెలంగాణాలో బంద్ కి పిలుపునివ్వడమే అసంబద్దంగా ఉంది.

ఏమైనప్పటికీ, ఆంధ్రా-ఓడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో మావోల అగ్రనేతలు చాలా మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వారి అగ్రనేత రామకృష్ణ జాడ ఇంతవరకు తెలియలేదు. ఆంధ్రాలో మవోలకి గట్టిదెబ్బ తగిలింది కనుక కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు.ఈలోగా తమ సత్తా చాటుకొనేందుకే తెలంగాణా బంద్ కి పిలుపునిచ్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆంధ్రాలో జరిగిన సంఘటనకి తెలంగాణా బంద్ కి పిలుపునీయడం ద్వారా ఆంధ్రాలో తాము బలహీనపడ్డామని అక్కడ తమ మాట చెల్లదని వారు స్వయంగా చెప్పుకొన్నట్లయింది.