డికె అరుణ వస్తానంటే...

ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు తెరాసలోకి వస్తామంటే..మేం కాదంటానా? అని ఇంతకు ముందు తెరాస పాట పాడేది. కానీ ఇప్పుడు అందుకు వ్యతికంగా ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె. అరుణ వస్తానంటే మేమే వద్దన్నాము..’ అని పాట పాడుతోంది. ఈ విషయం తెరాస నిజామాబాద్ ఎంపి కవిత స్వయంగా చెప్పారు. కొన్నిరోజుల క్రితం ఆమె తమని కలిసి తెరాసలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారని కానీ తామే వద్దన్నామని చెప్పారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నారని కానీ ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ ఆలోచన ఏదీ చేయడం లేదు కనుక వద్దన్నామని చెప్పారు. అదేవిధంగా తనకి మోడీ మంత్రివర్గం లో చేరే ఆలోచన ఏదీ లేదని కవిత చెప్పారు. 

డికె.అరుణ గురించి కవిత చెప్పిన మాట వాస్తవమేనని నమ్మవచ్చు. ఆమె గద్వాల జిల్లా ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రంగా విరుచుకు పడినప్పటికీ, ఆమె కోరిక మన్నించి జిల్లాని ఏర్పాటు చేసినందుకు ఆమె కెసిఆర్ కి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. మంత్రివర్గ విస్తరణ చేస్తారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో మహిళలకి ప్రాతినిధ్యం లేనందున, తెరాసలో చేరితే తనకి మంత్రిపదవి ఇస్తారని డికె.అరుణ ఆశపడి ఉండవచ్చు. లేకుంటే ఆమె గురించి కవిత ఆవిధంగా చెప్పనవసరమే లేదు. మంత్రిపదవి ఇస్తానంటే డికె.అరుణ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది తెరాసలోకి దూకేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇప్పటికే కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చిన వారితో పార్టీ నిండిపోయుంది. వారికే ఇంతవరకు ఏ పదవులు ఇవ్వలేనప్పుడు డికె.అరుణకి మాత్రం ఎలాగ ఇవ్వగలరు. అందుకే వద్దని చెప్పి ఉండవచ్చు.