ఎన్.ఐ.ఏ. అధిపతిగా మళ్ళీ ఆయనే

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ పదవీ కాలం 2015లోనే ముగిసింది. కానీ కేంద్రప్రభుత్వం ఒక ఏడాది ఆయన పదవీ కాలం పొడిగించింది. మళ్ళీ మరొక ఏడాది ఆయన పదవీ కాలం పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన యూరీ, పఠాన్ కోట్ లపై జరిగిన ఉగ్రవాదుల దాడులతో సహా ఇంకా అనేక ముఖ్యమైన కేసుల దర్యాప్తులని పర్యవేక్షిస్తున్నందున ఆయననే కొనసాగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.  

 ఆయన 2013, జూలై 30న ఎన్ఐఏ డిప్యూటీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. అంటే గత యూపియే హయంలోనే ఆయనకి ఎన్ఐఏలో ఆ కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయని స్పష్టం అవుతోంది. తరువాత కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయన సమర్ధతని గుర్తించి ఆయననే కొనసాగించింది. మళ్ళీ మరోసారి ఆయన పదవీ కాలం కూడా పెంచింది.

ఆయనని ఆ పదవికి ఎంపిక చేసింది తామేనని మరిచిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పట్టింది. శరద్ కుమార్ భాజపాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుకనే ఆయన పదవీ కాలం పొడిగించిందని ఆరోపించింది. అటువంటి కీలక పదవులలో ఉన్నవారిపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం వలన, ప్రజలకి కూడా వారిపై అనుమానాలు రేకెత్తించినట్లు అవుతుందనే విషయం కాంగ్రెస్ పార్టీ గ్రహించకపోవడం శోచనీయం.