యూపిలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో పుట్టిన ముసలం ఆ పార్టీకి, ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలిగిస్తోంది. కానీ ఆ మసి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి అంటలేదని తాజా సర్వేలు చెపుతున్నాయి. వారి మధ్య గొడవలు పతాక స్థాయికి చేరుకొన్న తరువాత ప్రముఖ సర్వే సంస్థ సి-ఓటర్ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సర్వేలలో ములాయం, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ ల కంటే అఖిలేష్ యాదవ్ పట్ల ప్రజలలో సానుభూతి, ఆ కారణంగా ఆదరణ పెరిగినట్లు తేలింది.
సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గూండాలని ప్రోత్సహిస్తుందనే చెడ్డ పేరుంది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత వారిని బాగా కట్టడి చేసినట్లు సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆ కారణంగానే శివపాల్ యాదవ్ వర్గం అఖిలేష్ యాదవ్ ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలని చూసి బహుశః ములాయం సింగ్ యాదవ్ కూడా లోలోనే చాలా సంతోషించి ఉంటారు. ఎంతైనా అతను తన కొడుకే కదా.
కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాల అభిప్రాయం వేరేగా ఉంది. ఈ నాలుగున్నరేళ్ళ సమాజ్ వాదీ పాలన పట్ల ప్రజలు చాలా విసుగెత్తిపోయున్నారు కనుక ఈసారి ఓడిపోవడం ఖాయం అని గ్రహించే తండ్రి, కొడుకు, చిన్నాన్న అందరూ కలిసి ఈ సరికొత్త నాటకాలు మొదలుపెట్టారని, వాటితో సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా సర్వే ఫలితాలు చూసినట్లయితే వారి అనుమానాలు నిజమేనేమో అనిపించక మానదు.