జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో గత కొన్ని రోజులుగా పాక్ సైనికులు కాల్పుల ఉల్లంఘనకి పాల్పడటం, వారిని భారత్ సైనికులు త్రిప్పికొడుతున్నట్లు వార్తలు వింటూనే ఉన్నాము. వారి కాల్పులలో భారత్ సైనికులు ఇద్దరు చనిపోగా, శుక్రవారం పాక్ సైనికులు 15మంది మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. దీనితో పాకిస్తాన్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మీడియా అభివర్ణిస్తోంది. మీడియాలో ఒకవర్గం ఈ ఘటనని పాక్ పై భారత్ మళ్ళీ పైచెయ్యి సాధించినట్లుగా అభివర్ణించింది.
అయితే ఒక భారత జవాను చనిపోతే దేశప్రజలు అందరూ ఎంతగా బాధపడతారో, ఒక పాక్ జవాను చనిపోయినా ఆ దేశప్రజలు అందరూ అంతే బాధపడతారు. ఈరోజు భారత్ సైనికుల చేతిలో 15 మంది పాక్ జవాన్లు చనిపోయినందుకు వారి కుటుంబసభ్యులు, పాక్ ప్రజలు చాలా బాధపడిఉంటారు. వారు భారత్ సైనికుల చేతిలో చనిపోవడం వాస్తవమే! కానీ, వారు తమ సైన్యాధికారుల యుద్ధోన్మాదానికి బలైపోయారని చెప్పక తప్పదు. వారందరూ తమపై అధికారుల ఆదేశాలని పాటిస్తూ భారత్ సైనికులపై కాల్పులు జరిపి ఎదురుకాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకొన్నారు. కనుక పాక్ ప్రజలు తమ సైన్యాధికారులనే తప్పు పట్టవలసి ఉంటుంది.
ఈరోజు జరిగిన కాల్పులలో ఒకవేళ వారుపై చెయ్యి సాధించి ఉండి ఉంటే నేడు వారి స్థానంలో భారత సైనికులు చనిపోయుండేవారు కదా! కనుక సరిహద్దులలో కాల్పులు సరికాదు. ఆ కాల్పులలో ఏ దేశ సైనికుడు మరణించినా అది ఎవరికీ గొప్ప సంతోషకరమైన విషయం కాదు. భారత్ తో శాంతి, స్నేహం కోరుకొంటున్నామని చిలుక పలుకులు పలికే పాక్ పాలకులు ముందుగా సరిహద్దులలో ఈ కాల్పుల ద్వారా సాధించేది ఏమీ ఉండదని గ్రహిస్తే మంచిది. పాక్ ఉగ్రవాదులని భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు, తన స్వంత సైనికులనే బలి చేసుకొంటున్నామని పాకే పాలకులు గుర్తిస్తే మంచిది.