దేశానికే గర్వకారణం మన పోలీస్ అకాడమీ

హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ దేశానికి అవసరమైన ఐ.పి.ఎస్. ఆఫీసర్లని అందింస్తోంది. అటువంటి అత్యుత్తమ శిక్షణా కేంద్రాలు లేని కారణంగా నేపాల్, భూటాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలకి చెందిన పోలీస్ అధికారులు కూడా అందులో శిక్షణ పొందుతుంటారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కేంద్రంలో శుక్రవారం 68వ బ్యాచ్ ఐ.పి.ఎస్.ఆఫీసర్లు పాసింగ్-అవుట్ పరేడ్ జరిగింది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆ కార్యక్రమానికి హాజరయ్యి వారి గౌరవ వందనం స్వీకరించారు. 44వారాలపాటు సాగిన కటోర శిక్షణ కార్యక్రమంలో దేశావిదేశాలకి చెందిన 109మంది ఉన్నారు. వారిలో విదేశాలకి చెందినవారు 15మంది కాగా మిగిలినవారు అందరూ భారతీయులే. ఈ బ్యాచ్ లో ఐ.పి.ఎస్. శిక్షణ పూర్తి చేసుకొన్నవారిలో అందరూ ఉన్నత విద్యావంతులే. వారిలో 66 మంది ఇంజనీర్లు, 9మంది ఎం.బి.బి.ఎస్. డిగ్రీ చేసినవారు, 9మంది ఎం.బి.ఏ., 10 మంది ఆర్ట్స్, ముగ్గురు న్యాయశాస్త్రంలో, ఇద్దరు కామర్స్ లో డిగ్రీలు చేశారు. 

ఈ బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసుకొన్నఐ.పి.ఎస్. ఆఫీసర్లలో ముగ్గురిని తెలంగాణా రాష్ట్రానికి నలుగురిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. తెలంగాణాలో బాధ్యతలు చేపట్టబోతున్నవారిలో మైలబత్తుల చేతన, కె. రక్షిత మూర్తి, పాటిల్ సమగ్రం సింగ్ గణపత్ రావులు ఉన్నారు.