రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన గురించి విని చాలా రోజులే అయ్యింది. వారి పెళ్ళి తరువాత కొన్ని రోజులు ఆమె పేరు మీడియాలో నానుతూ వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో చాలా హ్యాండ్సం హీరో రామ్ చరణ్ తేజ్ అంత లావుగా ఉన్న ఆమెని వివాహం చేసుకోవడం చేతనే వారిరువురి జోడీపై చాలా చర్చలు జరిగాయి. కానీ రామ్ చరణ్ తేజ్ వాటిని పట్టించుకోలేదు. బహుశః ఆమె చాలా బాధపడి ఉండవచ్చు కానీ ఆమె కూడా ఏనాడు బయటపడలేదు.
ఆమె అపోలో గ్రూప్ చైర్మన్ మనుమరాలు కావడంతో ఆసుపత్రిలో లైఫ్ మేనేజిమెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. బీ పాజిటివ్ అనే పత్రికకి ఎడిటర్ గా వ్యహరిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఎన్నడూ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించేందుకు ప్రయత్నించలేదు. ఆ తరువాత వారిరువురు విడిపోబోతున్నారని మీడియాలో ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అప్పుడు కూడా వారిరువురూ ఆ వార్తలని పట్టించుకోలేదు.
ఇన్నాళ్ళ తరువాత ఆమె మొట్టమొదటి సారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సన్నగా నాజుకుగా తయారైన ఆమెని చూస్తే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోకమానరు. రామ్ చరణ్ తేజ్ కి ఇప్పుడు ఆమె సరైన జోడీలాగ చాలా అందంగా కనిపిస్తున్నారు. తనపై వచ్చిన ఆ కామెంట్స్ గురించి మాట్లాడుతూ, “అందంగా ఉండే రామ్ చరణ్ రామ్ చరణ్ తేజ్ కి ఇంకా అందమైన అమ్మాయిని చేసుకొంటాడని అందరూ అనుకోవడం సహజమే. కానీ అప్పుడు నేను కొంచెం లావుగా ఉన్నందున అందరూ నన్ను విమర్శించి ఉంటారు. అది సహజమే. వాటిని నేను సానుకూలంగానే తీసుకొన్నాను. అందుకే నేడు ఈ రూపంలో మీ ముందున్నాను,” అని చెప్పారు.
“మీ పెళ్ళయి చాలా రోజులే అయ్యింది కదా పిల్లల్ని ఎప్పుడు కంటారు?” అనే ప్రశ్నకి “ఇప్పుడే పిల్లల్ని కనడం గురించి ఆలోచించదలచుకోలేదు. నేను చాలా శ్రమపడి సన్నబడ్డాను. కనుక పిల్లలు కనాలంటే మళ్ళీ నా శరీరం మామూలు స్థితికి వచ్చేస్తుంది. అది నాకిష్టం లేదు. ప్రస్తుతం మేమిద్దరం ఒక ఇల్లు కట్టుకొంటున్నాము. అందులో స్థిరపడి కొన్ని రోజులు ఇద్దరం లైఫ్ ఎంజాయ్ చేసిన తరువాత అప్పుడు పిల్లల్ని కంటాను. ఏదైనా సమస్య వస్తే అపోలో మొత్తం నా వెనుకే ఉంది,” అని అన్నారు.
మీడియాలో తమ డైవోర్స్ గురించి వచ్చిన గాసిప్స్ గురించి కూడా ఉపాసన చాలా చక్కగా జవాబిచ్చారు. “మేమిద్దరం భార్యాభర్తల కంటే మంచి ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. కనుక మా మధ్య అటువంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. రాబోదూ కూడా. ఒకవేళ అటువంటిదేమయినా ఉంటే మేమిద్దరం మీడియాని పిలిచి మరీ చెపుతాము. కనుక ఇకనైనా మాకు బాధ కలిగిస్తున్న అటువంటి పుకార్లని ప్రచారం చేయడం మానుకోమని అందరినీ అభ్యర్దిస్తున్నాను,” అని ఉపాసన అన్నారు.