పోలీసుల నుంచి హోంగార్డులని విడదీసి చూడలేము. వారు కూడా పోలీసులతో సమానంగా అంతకంటే ఎక్కువగానే పనిచేస్తుంటారు. కానీ పోలీసులతో పోలిస్తే వారి జీతాలు తక్కువే ఉద్యోగ భద్రత కూడా ఉండదు. తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేస్తానని ఎన్నికల సమయంలో కెసిఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటూ చాలా మందిని రెగ్యులరైజ్ చేశారు కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో పోలీసులకి చాలా సౌకర్యాలు కల్పించారు కానీ హోంగార్డుల దీనావస్థలపై నేటికీ ఆయన దృష్టి సారించలేదు. గత కొన్ని రోజులుగా వారు ఆందోళన బాట పట్టారు. తమని రెగ్యులరైజ్ చేయాలని, హెల్త్ కార్డులు వగైరా సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. కానీ తెరాస సర్కార్ వారి ఆందోళనలని పట్టించుకోకపోవడంతో అది క్రమంగా ఉదృతమయ్యి, ఇవ్వాళ్ళ సచివాలయం ముట్టడికి దారి తీసింది.
ఈరోజు మధ్యాహ్నం వారితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చర్చలు జరిపారు కానీ అవి ఫలించకపోవడంతో హోంగార్డులు పోలీస్ వలయాలని చేదించుకొని సచివాలయంలోకి ప్రవేశించగలిగారు. దానితో వారికీ, పోలీసులకి మధ్య త్రోపులాటలు జరిగాయి. కొందరు హోంగార్డులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేయడంతో సచివాలయం పరిసర ప్రాంతాలలో బారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమాచారం అందుకొన్న ఎస్.ఫై.ఎఫ్. డిజి తేజ్ దీప్ కౌర్ అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పి వారి ప్రతినిధులతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా రాజీవ్ శర్మ గానీ వచ్చి తమ డిమాండ్లని అంగీకరిస్తున్నట్లుగా ప్రకటించేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
నిత్యం వారు ఏ పోలీసులతో కలిసిమెలిసి పనిచేస్తుంటారో వారితోనే ఘర్షణ పడవలసి రావడం చాలా దురదృష్టకరం. ఇటువంటి అవాంచనీయమైన పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా అప్రదిష్ట కలిగిస్తాయని గుర్తుంచుకోవాలి. పోలీసుల కంటే ఎక్కువ కష్టపడే హోంగార్డులు అడుగుతున్నవి చాలా సహేతుకమైనవే తప్ప అత్యాశతో అడుగుతున్నవి కావు. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ వారి సమస్యలని సానుభూతితో అర్ధం చేసుకొని వారికీ న్యాయం చేస్తే అది ఆయనకే గౌరవం కదా!