సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత భారత్-పాక్ మద్య పతాకస్థాయికి చేరుకొన్న ఘర్షణ వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతోందనుకొంటుంటే, మళ్ళీ మరో సమస్య వచ్చింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పాక్ హైకమీషన్ లో పనిచేస్తున్న మొహ్మద్ అక్తర్ అనే ఒక ఉద్యోగి నిన్న డిల్లీ జంతు ప్రదర్శన శాలలో రాజస్థాన్ కి చెందిన ఇద్దరు వ్యక్తులని కలుసుకొని మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా అతని వద్ద నుంచి ఆర్మీ, బి.ఎస్.ఎఫ్.లకి చెందిన కొన్ని రహస్యపత్రాలు లభించాయి. రాజస్తాన్ నుంచి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులే అతనికి ఆ రహస్య పత్రాలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
కానీ మొహ్మద్ అక్తర్ కి దౌత్యపరమైన రక్షణ ఉన్న కారణంగా పోలీసులు అతనిని అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టవలసి వచ్చింది. అతనిని 48 గంటలలో దేశం విడిచివెళ్ళిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాంగశాఖ కార్యదర్శి జయశంకర్ పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ ని తన కార్యాలయానికి పిలిపించుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అబ్దుల్ బాసిత్ కూడా తన ఉద్యోగిని పోలీసులు నిర్బంధించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌత్యపరమైన రక్షణ కలిగి ఉన్న అతనిని నిర్బంధించడం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాదించారు. పాక్ ప్రభుత్వం కూడా భారత్ చర్యలని తప్పు పట్టింది.
పాక్ ఐ.ఎస్.ఐ. ఆదేశాల మేరకే మొహ్మద్ అక్తర్ భారత్ లో గూడచర్యానికి పాల్పడుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల అనుమనించినట్లే అతని వద్ద భారత్ కి చెందిన రహస్యపత్రాలు పట్టుబడ్డాయి. అయినా చేసిన తప్పుకి సిగ్గు పడకుండా తిరిగి భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం పాకిస్తాన్ కే చెల్లు.
సమాచారం మేరకే, అరెస్ట్ చేసి డిల్లీకి తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. వారిరువురూ కూడా సరిహద్దు భద్రతా దళాల కదలికలకి సంబంధించి వివరాలని పాకిస్తాన్ కి చేరవేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. పాక్ దౌత్య ఉద్యోగులు ఈవిధంగా గూడచర్యానికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు పట్టుబడ్డారు. కానీ వారికి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక వారిని వెనక్కి త్రిప్పి పంపగానే వారి స్థానంలో దౌత్య ముసుగులో కొత్త గూడఛారులని పంపడం పాకిస్తాన్ కి ఒక దురలవాటుగా మారిపోయింది. పాకిస్తాన్ మాటలకి చేతలకి ఎక్కడా పొంతన ఉండదని ఇది మరొకసారి నిరూపిస్తోంది.