నయీం కేసులో అన్ని పార్టీలకి చెందిన రాజకీయ నేతలు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటపడుతుండటంతో అది ఎప్పుడు ఎవరి మెడకి చుట్టుకొంటుందో అనే భయం అందరినీ వెంటాడుతూ ఉంది. కానీ అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమకి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని ప్రకటిస్తున్నారు. ఈ కేసుతో తెరాస సర్కార్ తమని రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ కేసులో తెరాసలోనే ఫస్ట్ వికెట్ పడబోతున్నట్లు తాజా సమాచారం.
ఈకేసులో మొట్టమొదట బయటపడిన పేరు తెలంగాణా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్. తమ పార్టీలో ఉన్న వ్యక్తిని ఉపేక్షిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలపై బురద జల్లాలని ప్రయత్నిస్తే వాళ్ళు కూడా నిలదీసే అవకాశం ఉంటుంది. పైగా గౌరవప్రదమైన అటువంటి పదవిని నిర్వహిస్తున్న వ్యక్తికి ఒక గూండాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన తరువాత కూడా ఆ పదవిలో కొనసాగనిస్తే ప్రభుత్వానికి అప్రదిష్ట కలుగుతుంది. కనుక విద్యాసాగర్ ని పదవిలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. అదే జరిగితే నయీం కేసులో మొదటి వికెట్ అధికార పార్టీలోనే పడినట్లు అవుతుంది. ఆ తరువాత అధికార, ప్రతిపక్ష పార్టీలలో వరుసగా వికెట్లు పడటం మొదలవుతాయేమో చూడాలి.