యూపిలో సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న గొడవలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈరోజు కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈరోజు గవర్నర్ రాం నాయక్ ని కలిసి రావడంతో, ఆయన రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తనకి 205 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అయన ప్రకటించడంతో పార్టీలో చీలిక ఏర్పడబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి.
గత మూడు వారాలలో రెండుసార్లు మంత్రిపదవి నుంచి తొలగించబడిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఈరోజు తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రధానద్వారం పక్కన ఉండే తన నేమ్ ప్లేట్ ని కూడా తొలగించేశారు. అంటే మంత్రిపదవి నుంచి మళ్ళీ తప్పుకొన్నట్లుగా భావించవచ్చు. కానీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం ప్రకటించలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశిస్తే మంత్రిగా కొనసాగుతానని చెప్పడం విశేషం.
అఖిలేష్ వర్గానికి చెందిన మంత్రి నరేన్ పాండే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నాడంటూ, అతనిని పార్టీ నుంచి ఆరేళ్ళపాటు బహిష్కరిస్తున్నట్లు శివపాల్ యాదవ్ ఇవ్వాళ్ళ ప్రకటించారు. అతనిని మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి ఒక లేఖ వ్రాశారు. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు.
సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు ఏదో సస్పెన్స్ సినిమా కధలాగ సాగుతూ తరువాత ఏమి జరుగబోతోందనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కనుక రేపు ఏమి జరుగబోతోందో చూడాలి.