ఆంధ్రా, ఓడిశా సరిహద్దు ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో 24 మంది మావోయిస్టులు చనిపోవడంతో వారు ఏపి సిఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మావోల ఏపి ప్రతినిధి శ్యాం సంతకంతో ఉన్న ఒక లేఖ ఈరోజు మీడియాకి అందింది. దానిలో ఏమి వ్రాసుందంటే, మావోలని హత్య చేయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు. ఏదో ఒకరోజు వారిద్దరినీ తప్పకుండా చంపి తీరుతామని హెచ్చరించారు. అవసరమైతే ఆత్మహుతి దాడికి కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎల్లకాలం పోలీసులు, మిలటరీ కాపాడలేదని వారిని ఏదో ఒకరోజు తప్పకుండ చంపుతామని హెచ్చరించారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే శేషాచలం అడవులలో 21 మంది కూలీలని ఎన్కౌంటర్ చేయించారని, మళ్ళీ ఇప్పుడు 24 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నారని అందుకు ఆయన ఫలితం అనుభవించక తప్పదని శ్యాం హెచ్చరించారు. పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా విషం కలిపిన ఆహారం మావోలకి అందించి వారు నేలపై పడిపోయున్న సమయంలో పోలీసులు వారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి చేసిన కుట్రేనని సహాయం ఆరోపించారు. తెలంగాణాలో నయీంని సృష్టించింది కూడా చంద్రబాబేనని, అతని ద్వారా అనేకమంది అమాయక ప్రజలని, మావోయిష్టులని హత్య చేయించారని శ్యాం ఆరోపించారు.
అయితే మావోల ఆరోపణలని ఏపి డిజిపి సాంభశివరావు ఖండించారు. మావోల కోసం అడవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు వారు తమని చూసి కొండపై నుంచి కాల్పులు జరుపడం మొదలుపెట్టిన తరువాతే తాము కూడా కాల్పులు జరుపడం మొదలుపెట్టామని చెప్పారు. గాయపడిన మావోలలో ఎవరైనా ప్రభుత్వానికి లొంగిపోదలిస్తే తెలియజేయాలని కోరారు.