అవును..రేవంత్ రెడ్డికి అది దీపావళి గిఫ్టుగానే భావించవలసి ఉంటుంది. ఓటుకి నోటు కేసులో తనకి ఏసీబి కోర్టు విదించిన బెయిల్ షరతులని సడలించాలని కోరుతూ ఆయన వేసుకొన్న పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన హైదరాబాద్ దాటి వెళ్ళకూడదనే షరతుని సడలించింది. అలాగే ప్రతీవారం ఏసిబి ముందు హాజరు కావాలనే షరతుని కూడా సడలించింది. రేవంత్ రెడ్డి బెయిల్ షరతులు సడలించడంపై ఏసిబి అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ హైకోర్టు దాని అభ్యంతరాలు పట్టించుకోలేదు. అయితే ఏసిబి ఎప్పుడు విచారణకి పిలిచినా హాజరు కావాలని రేవంత్ రెడ్డిని అదేశించింది. అందుకు ఆయన తరపు న్యాయవాది అంగీకరించడంతో బెయిల్ షరతులని సడలిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రాజకీయాలలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చాలా ఊరటనిచ్చినట్లే చెప్పవచ్చు. ఓటుకి నోటు కేసుపై తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు కనుక ఈ తీర్పుతో ఆయనకి పూర్తి స్వేచ్చ లభించినట్లే భావించవచ్చు. కనుక హైకోర్టు తీర్పు ఆయనకి దీపావళి గిఫ్ట్ వంటిదేనని చెప్పవచ్చు.