వారికి బైక్స్ ఇవ్వడం మంచి ఆలోచనే

రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపకశాఖలో ఒక నూతన ప్రయోగానికి నిన్న శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బారీ అగ్నిమాపకవాహనాలు మాత్రమే తరలివచ్చేవి. కానీ అవి ప్రమాద స్థలానికి చేరుకోనేలోగానే బారీగా ఆస్థినష్టం, కొన్నిసార్లు ప్రాణనష్టం జరుగుతుంటుంది. ఈ సమస్యకి పరిష్కారంగా అగ్నిమాపకశాఖలో ద్విచక్రవాహనాలని సమకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదం జరిగిన వెంటనే వాటిపై సిబ్బంది అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో సహాయచర్యలు చేపడతారు. బైక్స్ పై వారు మారుమూల ప్రాంతాలకి కూడా వేగంగా చేరుకొని ప్రమాద నివారణకి కృషి చేయగలరు కనుక  నష్టం తగ్గించవచ్చు. ఈ ద్విచక్రవాహనాలపై వచ్చే శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది వద్ద అత్యవసర చికిత్సకి అవసరమైన అన్ని మందులు ఉంటాయి. వారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే సహాయ చర్యలు చేపట్టి, తమ కార్యాలయానికి అక్కడి వివరాలు అందిస్తారు.

అగ్నిమాపకశాఖకి ద్విచక్ర వాహనాలని సమకూర్చడమే కాకుండా, కొత్తగా 100మంది సిబ్బందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హోంమంత్రి నాయిని నరసింహ రెడ్డి నిన్న నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి వారి సేవలని ప్రారంభించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అన్ని జిల్లాలలో ఈ ద్విచక్రవాహన అగ్నిమాపక సిబ్బందిని కూడా నియమిస్తామని మంత్రి చెప్పారు. ముఖ్యంగా పత్తి, మిర్చి గోదాములకి, నూలు పరిశ్రమలకి సమీపంలో  ఈ అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.