ఏపీ సిఎం జగన్‌ బందువు భాస్కర్ రెడ్డి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్ రెడ్డి అర్దాంగి భారతి. ఆమె మేనమామ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేసారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనను అరెస్ట్‌ చేసి కడప నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చి జ్యూడీషియల్ రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు రలించారు. 

అయితే ఈ కధ ఇక్కడితో పూర్తవలేదు. ఈ హత్య కేసులో ఆయన కుమారుడు, కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటునందున నేడు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నిన్ననే ఆయనకు నోటీస్ ఇచ్చారు. దీంతో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి పది కార్లలో తన అనుచరులను వెంటబెట్టుకొని కడప నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. 

ఈ కేసుని ఏపీలో దాదాపు నాలుగేళ్ళుగా సీబీఐ విచారణ జరిపింది కానీ నిందితులందరూ అధికార వైసీపీకి చెందినవారే కావడంతో కేసు విచారణ ముందుకు సాగకుండా ఆటంకాలు సృష్టించారు. చివరికి సీబీఐ అధికారులపైనే కేసులు వేసి ముప్పతిప్పలు పెట్టారు. ఇక ఏపీలో ఈ కేసు విచారణ పూర్తవదని గ్రహించిన వివేకా కుమార్తె సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయించుకొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి గడువు విధించింది కూడా. 

అప్పటి నుంచే ఈ అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్‌ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు కనుక నేడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంతకాలం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వారిని గట్టిగా వెనకేసుకువచ్చింది. కనుక ఇప్పుడు ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.