భాజపాది జాతీయవాదం. కాశ్మీర్ లో హురియత్ నేతలది వేర్పాటువాదం. కనుక రెండూ భిన్నదృవాల వంటివి. కానీ భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా నేతృత్వంలో ఒక బృందం ఇవ్వాళ్ళ కరుడుగట్టిన వేర్పాటువాదిగా పేరొందిన సయ్యద్ అలీ గిలానీతో కాశ్మీర్ లో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. కాశ్మీర్ లో ఇటీవల చెలరేగిన హింస గురించే వారు ప్రధానంగా చర్చించినట్లు సిన్హా చెప్పారు కానీ అంతకు మించి వారి సమావేశం గురించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. త్వరలో మిగిలిన వేర్పాటువాద నేతలతో కూడా సమావేశం అవుతామని తెలిపారు. కాశ్మీర్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నంలోనే వేర్పాటువాదులతో సమావేశాలు అవుతున్నట్లు తెలిపారు.
దీనిని బట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదులు ఎంత శక్తివంతులో అర్ధం చేసుకోవచ్చు. కాశ్మీర్ లో శాంతి నెలకొని ఉండాలంటే వారిని ప్రభుత్వాలు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుందని అర్ధం అవుతోంది. సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో మొదటి నుంచి కూడా జాతీయవాదం వినిపించే రాజకీయ పార్టీలు, నేతలు లేనందునే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు. అందుకే రాష్ట్రంలో వేర్పాటువాదులు సమాంతరం ప్రభుత్వం నడిపించగలుగుతున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందంటే కనీసం బహిరంగంగా మువ్వన్నెల పతాకం కూడా ఎగురవేయలేని దుస్థితిలో ఉంది.
ఏది ఏమైనప్పటికీ, కాశ్మీర్ సమస్య చెయ్యి దాటిపోకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం కనుక వేర్పాటువాదుల ముందు కేంద్రప్రభుత్వం మోకరిల్లవలసి వస్తోంది. ఇది దేశానికి చాలా అవమానకరమే కానీ వేరే మార్గం లేనందునే మోడీ ప్రభుత్వం అందుకు కూడా సిద్దపడినట్లు భావించవలసి ఉంటుంది. కనీసం ఇప్పటి నుంచైనా అక్కడ ఈ పరిస్థితులలో మార్పు తీసుకువచ్చి, ఆ రాష్ట్రాన్ని కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఒక రాష్ట్రమనే భావన, అక్కడి ప్రజలలో, పాలకులలో జాతీయభావం కల్పించడానికి అవసరమైన దీర్గకాలిక చర్యలు చేపట్టడం మంచిది. అక్కడి వారందరూ భారత్ తో మమేకం అయినప్పుడే కాశ్మీర్ సమస్యలో పాకిస్తాన్ వేలు పెట్టే సాహసం చేయకుండా ఉంటుంది.