పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణ ఎదుర్కొంటున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. బయట మీడియాతో మాట్లాడుతూ, “టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెర తీశారు. ఇది పేపర్ లీక్ కాదని వరంగల్ సిపి రంగనాథ్ స్వయంగా చెప్పారు. కానీ నేను హిందీ పేపర్ లీక్ చేశానంటూ నామీద అక్రమ కేసు బనాయించారు. ఎవరో పేపర్ లీక్ చేస్తే దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను? హిందీ పేపర్ నేనులీక్ చేశాననుకొంటే మరి తెలుగు పేపర్ని ఎవరు లీక్ చేశారు?పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పుకొంటున్నప్పుడు లోపలకి సెల్ ఫోన్లు ఎలా వెళ్ళాయి?దీనికి ఎవరు బాధ్యులో వారిని పట్టించుకోకుండా నేనే ఆ కుట్ర చేశానంటూ అక్రమ కేసు బనాయించడం ఏమిటి?
ముందు టిఎస్పీఎస్సీ స్కామ్‌కు మంత్రి కేటీఆర్‌ని బాధ్యుడిని చేస్తూ మంత్రివర్గంలో నుంచి బర్త్ రఫ్ చేయాలి. పరీక్షల రద్దు కారణంగా నష్టపోయిన అభ్యర్ధులందరికీ లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నామీద అక్రమకేసు బనాయించి టిఎస్పీఎస్సీ స్కామ్ నుంచి తప్పించుకోవచ్చనుకొంటున్నారేమో? నేను ఎవరినీ విడిచిపెట్టను. మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను బర్త్ రఫ్ చేసేంతవరకు నా పోరాటం ఆగదు,” అని బండి సంజయ్ హెచ్చరించారు.