పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఏ-1గా బండి సంజయ్‌

పదో తరగతి పేపర్ లీక్ కేసులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు ఏ-1 నిందితుడుగా రిమాండ్‌పై రిపోర్టులో పేర్కొన్నారు. ఏ-1 బండి సంజయ్‌, ఏ-2 బూర ప్రశాంత్, ఏ-3 గుండబోయిన మహేష్(కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్), ఏ-4మైనర్ బాలుడు, ఏ-5 శివగణేష్, ఏ-6 పోగు సుభాష్, ఏ-7 పోగు శశాంక్, ఏ-8 దూలం శ్రీకాంత్, ఏ-9 పెరుమండ శార్మిక్, ఏ-10గా పోతబోయిన వసంత్‌లను పేర్కొన్నారు. 

వారిలో బండి సంజయ్‌, ప్రశాంత్, గుండబోయిన మహేష్, శివగణేష్లను అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని వరంగల్‌ సిపి రంగనాధ్ తెలిపారు. ఈ కేసులో విద్యాశాఖకు సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకొంటున్నారని తెలిపారు.  

వరంగల్‌ జిల్లాలో కమలాపూర్ పాఠశాల నుంచి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన్నట్లు కనుగొన్నామని సిపి రంగనాధ్ తెలిపారు. నిందితులపై సెక్షన్స్ 120బి, 420, 447, 505ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రశ్నాపత్రాన్ని ఫార్వర్డ్ చేసినవారందరినీ తాము అరెస్ట్ చేయలేదని, లీకేజీకి ముందు నిందితుల మద్య వాట్సప్ ఛాటింగ్, కాల్ డాటా ఆధారంగానే కుట్రకు పాల్పడ్డారని భావించి అరెస్ట్ చేశామని తెలిపారు. 

ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం బండి సంజయ్‌-ప్రశాంత్ పలుమార్లు వాట్సప్ చాటింగ్, కాల్స్ చేసుకొన్నట్లు గుర్తించాము. ప్రశాంత్ ఫోన్‌ స్వాధీనం చేసుకొన్నాము కానీ బండి సంజయ్‌ తన ఫోన్‌ ఇవ్వడానికి నిరాకరించారు. అది మా చేతికి వస్తే ఈ కుట్ర ఏవిదంగా జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం సులువు అవుతుంది. బండి సంజయ్‌ ఎంపీ కనుక ఆయనను అరెస్ట్ చేస్తున్న విషయాన్ని లోక్‌సభ స్పీకరుకు తెలియజేసి చట్టప్రకారమే ముందుకు సాగామని సిపి రంగనాధ్ చెప్పారు. 

మంగళవారం ఉదయం 11.18 గంటలకు ప్రశాంత్ మీడియా హెడ్స్ కి, 11.20కి బండి సంజయ్‌కి ప్రశ్నాపత్రాన్ని ఫార్వర్డ్ చేసిన్నట్లు గుర్తించామని చెప్పారు. ఆ తర్వాత బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఆయన పీఏ రాజుతో సహా పలువురు బిజెపి నేతలకు కూడా ఫార్వర్డ్ చేసిన్నట్లు గుర్తించామని, కానీ వారెవరూ ఈ కుట్రలో పాల్గొనలేదు కనుక ఎవరినీ అరెస్ట్ చేయలేదని సిపి రంగనాధ్ తెలిపారు.  

గతంలో టీవీ జర్నలిస్టుగా పనిచేసిన ప్రశాంత్ ప్రస్తుతం వరంగల్‌ లోక్‌సభలో నియోజకవర్గం పరిధిలో ‘నేషన్ విత్ నమో (నరేంద్ర మోడీ) టీమ్‌లో పనిచేస్తున్నారు. ఆయన, బండి సంజయ్‌ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. దీని కోసం వారు మైనర్ విద్యార్థులను ఉపయోగించుకొన్నారు. బండి సంజయ్‌ అరెస్ట్‌ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు జేసేందుకు ఈ కుట్రకు పాల్పడినందుకే అరెస్ట్‌ చేశాము,” అని సిపి రంగనాధ్ తెలిపారు.