బండి సంజయ్‌, రఘునందన్ రావు అరెస్ట్... హైటెన్షన్

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని కరీంనగర్‌లో ఆయన నివాసం నుంచి మంగళవారం అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆయనపై సెక్షన్స్ 151 (1&2) కింద కేసు నమోదు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు చేరుకొని నిరసనలు చేపట్టారు. 

విషయం తెలుసుకొన్న దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అక్కడకు చేరుకొని బండి సంజయ్‌ని కలవబోతే పోలీసులు అడ్డుకొన్నారు. కానీ ఆయన లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను కూడా అరెస్ట్ చేశారు. పలువురు బిజెపి కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. 

హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందిస్తూ, “తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నాపత్రాల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తన వైఫల్యాలని కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కొత్త డ్రామా మొదలుపెట్టింది. అర్దరాత్రి పోలీసులు ఆయన ఇంట్లోకి జొరబడి ఉగ్రవాదిని పట్టుకొన్నట్లు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. బండి సంజయ్‌ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం లేదు. ఆయన ఓ ఎంపీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడనే విషయం పోలీసులు పట్టించుకోలేదు. బండి సంజయ్‌ని తక్షణం బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.     

ఈరోజు ఉదయం పోలీసులు బండి సంజయ్‌ని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌ నుంచి భారీ బందోబస్తుతో భువనగిరి కోర్టుకు తరలిస్తుండగా, బిజెపి కార్యకర్తలు వారిని అడ్డుకొని తమ నాయకుడిని ఏ నేరం కింద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి భువనగిరి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్‌ విధిస్తే అక్కడి నుంచి జైలుకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

బండి సంజయ్‌ అరెస్టుని సవాలు చేస్తూ రాష్ట్ర బిజెపి నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ వేశారు. బండి సంజయ్‌ అరెస్టుని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా బండి సంజయ్‌ అరెస్టును ఖండించారు. ఢిల్లీలో బిజెపి పెద్దలు కూడా బండి సంజయ్‌ అరెస్ట్ వ్యవహారంపై రాష్ట్ర బిజెపి నేతలతో మాట్లాడుతున్నారు.