కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి... దగ్గరకు వెళ్తే నలిగిపోతాము!

తెలంగాణ కాంగ్రెస్‌ ఏదో కొన్ని రోజులు మాత్రమే ఓ పద్దతిలో ముందుకు సాగుతుంది. ఆ సమయంలో పార్టీలో సీనియర్ నేతలు మౌనంగా ఉండటం వలన అందరూ కలిసి కట్టుగా ఉన్నారనే భావన కల్పిస్తారు. అయితే అది కొన్ని రోజుల ముచ్చటే అని గత 7-8 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. 

తెలంగాణ కాంగ్రెస్‌కు మాణిక్‌రావు థాక్రే ఇన్‌ఛార్జ్‌గా వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితులు చక్కబడిన్నట్లనిపించాయి. రేవంత్‌ రెడ్డితో సహా చాలామంది సీనియర్లు చేతులు కలుపుకోకపోయినా హాత్ సే హాత్ జోడో అంటూ తమ తమ నియోజకవర్గాలలో పాదయాత్రలు చేసుకొంటున్నారు. 

అంతా బాగానే ఉందనుకొంటున్న సమయంలో సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు “ప్రజాభీష్టం మేరకు భవిష్యత్‌లో బిఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్‌ కలిసి పనిచేయవలసి రావచ్చు,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆయనకు వత్తాసు పలుకుతూ మాట్లాడారు. 

అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వారి అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం బిఆర్ఎస్‌తో పొత్తుల ప్రసక్తే ఉండదు. కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా నమ్మి దగ్గరకు వెళితే నిర్ధాక్షిణ్యంగా నలిపివేస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహాలు మరిచిపోయి ఆయనతో దోస్తీ కోరుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నేటికీ బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీలు పోరాడుకొంటున్నట్లు నటిస్తూ రెండూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని ప్రయత్నిస్తున్నాయి. 

కాంగ్రెస్‌ నాయకులు అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రజలలో కేసీఆర్‌ పట్ల వ్యతిరేకత రాన్రాను పెరుగుతూనే ఉంది. ప్రజలు మతతత్వ బిజెపివైపు మొగ్గే అవకాశం లేదు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని నమ్ముతున్నాను. కనుక బిఆర్ఎస్‌తో కలవాలనే ఆలోచనలు మానుకొని అందరూ కలిసికట్టుగా పోరాడితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 80 సీట్లు వస్తాయి. కనుక కాంగ్రెస్‌ నేతలందరూ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాదని బిఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా మాట్లాడినా, వ్యవహరించినా వారిపై కటిన చర్యలు తీసుకొనేందుకు వెనకాడను,” అని రేవంత్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.