టిఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు కూర్చోన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ, సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆమె తన అనుచరులతో కలిసి ఈరోజు ఉదయం టిఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చోనగా, పోలీసులు అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతించబోమని చెప్పారు. ధర్నా విరమించి వెళ్లిపోవాలని పోలీసుల సూచనను ఆమె తిరస్కరించడంతో పోలీసులు ఆమెను, అనుచరులను బలవంతంగా అరెస్ట్ చేసి వ్యానులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో టిఎస్‌పీఎస్సీ ఆడుకొంటే తెలంగాణ ప్రభుత్వం ఇదేమీ పెద్ద విషయం కాదన్నట్లు, కేవలం ఇద్దరి వల్లనే ఈ సమస్య వచ్చిందంటూ సమస్యను చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరం. ప్రభుత్వం తీరు ఈవిదంగా ఉన్నప్పుడు దాని కనుసన్నలలో పనిచేసే సిట్‌తో విచారణ జరిపిస్తే నష్టపోయిన నిరుద్యోగులకు ఏవిదంగా న్యాయం జరుగుతుంది?కనుక ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.