తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ పేరుతో మహిళల కోసమే ప్రత్యేకంగా మహిళా క్లినిక్స్ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రతీ మంగళవారం ఈ మహిళా క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే అన్నిరకాల ఆరోగ్య సమస్యలతో పాటు 8 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, వాటి ప్రకారం అవసరమైన వైద్య చికిత్సలు, మందులు ఉచితంగా అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభమయిన తొలివారంలో 4,793 మంది, రెండో వారంలో 6,328 మంది, మూడో వారంలో 7,965 మంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకొన్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఈ మూడు వారాలలోనే మొత్తం 10,242 నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు పంపగా 24 గంటలలో వాటి ఫలితాలు సదరు మహిళల ఫోన్లకు పంపబడ్డాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా మహిళలకు ప్రతీ మంగళవారం నిర్వహించే మహిళా క్లినిక్స్‌లో చికిత్సలు చేస్తున్నారు.
కనుక రాష్ట్రంలో మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.