వందేభారత్‌పై రాళ్ళు విసిరితే 5 ఏళ్ళు జైల్లోనే!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సదుపాయాలతో, గంటకు 160 కిమీ వేగంతో దూసుకుపోయే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను చూసి భారతీయులు అందరూ గర్వపడాలి. కానీ దురదృష్టవశాత్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో పదేపదే వాటిపై దుండగులు రాళ్ళతో దాడులు చేస్తున్నారు. మిగిలిన ఏ రైళ్ళపై ఇటువంటి దాడులు జరిగిన దాఖలాలు లేవు కానీ కేవలం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళపై మాత్రమే దాడులు జరుగుతుండటం గమనిస్తే వారి వెనుక రాజకీయ పార్టీలు లేదా నేతల హస్తం ఉందేమో? అనే సందేహం కలుగుతోంది. జనవరి 15వ తేదీ నుంచి సికింద్రాబాద్‌-విశాఖ మద్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ మూడు నెలల్లోనే వాటిపై తొమ్మిదిసార్లు రాళ్ళ దాడులు జరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్దం చేసుకోవచ్చు.     

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళపై ఈ దాడులు కొనసాగుతుండటంతో దక్షిణమద్య రైల్వే కటిన నిర్ణయం తీసుకొంది. ఇకపై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళపై దాడులు చేసినవారిని రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం 5 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఒక్క వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పైనే కాదు... రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినా ఇదే సెక్షన్ కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని దక్షిణమద్య రైల్వే ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. కనుక ఇకపై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళపై రాళ్ళు రువ్వాలనుకొనేవారు 5 ఏళ్ళు జైలులో గడిపేందుకు సిద్దపడక తప్పదు.