వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోగా ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించనట్లయితే, పార్లమెంటు సమావేశాలని స్తంభింపజేస్తామని, ఆ తరువాత, ప్రత్యేకహోదా ఇవ్వందుకు నిరసనగా తమ పార్టీ ఎంపిలు అందరూ తమ పదవులకి రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించారు. ఈరోజు కర్నూలులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. వైకాపాకి 9 మంది లోక్ సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
మోడీకి చాలా సన్నిహితుడని పేరున్న చంద్రబాబు నాయుడు బ్రతిమాలినా ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు, జగన్ బెదిరింపులకి భయపడి ఇస్తారనుకోలేము. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. అయినా ఆవిధంగా ఎందుకు ప్రకటించారంటే తెదేపాపై ఒత్తిడి పెంచడానికి, ఉపఎన్నికలలో మళ్ళీ అన్ని సీట్లు గెలుచుకొని చూపించి తన బలాన్ని ప్రదర్శించుకొని ఇతర పార్టీల నేతలని వైకాపాలో ఆకర్షించేందుకే తప్ప ప్రత్యేక హోదా కోసం మాత్రం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.
కానీ ప్రతీసారి లాగే ఈసారి కూడా జగన్ నిర్ణయం బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వారిలో ఎవరైనా రాజీనామాలు చేయడానికి అంగీకరించకపోతే, అప్పుడు జగన్ పరువే పోతుంది. వారు కూడా తెదేపాలోకి జంప్ అయిపోవచ్చు. అప్పుడు నష్టపోయేది వైకాపాయే. జగన్ తొందరపాటు నిర్ణయానికి గతంలో వైకాపా ఎన్నోసార్లు మూల్యం చెల్లించింది. మళ్ళీ మరోమారు చెల్లించే అవకాశం కనబడుతోంది.