తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని ఈనెల 30న ఆసుపత్రి నుంచి దిస్చార్జే చేయబోతున్నట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి ఆమె మళ్ళీ కోలుకొని ఇంటికి వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడిఎంకె శ్రేణులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె దీపావళినాడే ఇంటికి తిరిగి వస్తుండటంతో వారికి ఈసారి చాలా ఘనంగా పండుగ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకోన్నప్పటికీ, వైద్యుల సలహా మేరకు మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. కనుక పన్నీర్ సెల్వం నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జయలలిత కోలుకొని ఇంటికి తిరిగి వస్తునందుకు ఆమె పార్టీ శ్రేణులు సంతోషించడం సహజమే. కానీ ఆమె అనారోగ్య కారణంగా రాష్ట్ర రాజకీయాలలో ఏర్పడిన శూన్యత లేదా అయోమయ పరిస్థితిని ఉపయోగించుకొని చక్రం తిప్పుదామని ఆశపడిన కరుణానిధికి కొంచెం నిరాశ కలుగవచ్చు. బహుశః ఇక తన జీవితంలో జయలలిత పదవిలో నుంచి దింపి తను ఆ కుర్చీలో కూర్చోలేననే సంగతి గ్రహించినట్లే ఉన్నారు. అందుకే కొంచెం రిస్క్ తీసుకొని తన చిన్న కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని ప్రకటించేశారేమో?