మహారాష్ట్రలో దళిత బంధు, రైతు బంధు ఎందుకివ్వరు?

ఆదివారం మహారాష్ట్రలోని కాందార్ లోహలో బిఆర్ఎస్‌ బహిరంగసభకు వేలాదిమంది తరలి రావడంతో సభ విజయవంతమైంది. ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, మహారాష్ట్రలోనే ఛత్రపతి శివాజీ, డా.అంబేడ్కర్ వంటి మహనీయులు జన్మించారని కానీ మహారాష్ట్రలో బడుగు బలహీనవర్గాల ప్రజలకు నేటికీ న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలో దళిత బంధు వంటి అనేక పధకాలు అమలుచేస్తున్నామని, కానీ మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 

మహారాష్ట్ర నుంచి గోదావరి ప్రారంభమై దిగువ రాష్ట్రాలకు ప్రవహిస్తుంటే దిగువ రాష్ట్రమైన తెలంగాణలో ఆ నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకొన్నామని, కానీ పక్కనే గోదావరి ప్రవహిస్తున్నా మహారాష్ట్రలో లక్షలాది ఎకరాల భూములు నీళ్ళు లేక ఎందుకు బీడు భూములుగా మిగిలిపోయాయని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు భరోసా తదితర అనేక పధకాలు అమలుచేస్తున్నామని కానీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇంచుమించు ఇదే పరిస్థితులున్నాయని, వీటిని మార్చి అందరికీ న్యాయం చేసేందుకే తాను బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు. 

దేశంలో పుష్కలంగా సహజవనరులు ఉన్నప్పటికీ, ఇంతకాలంగా దేశాన్ని పాలిస్తున్నవారికి వాటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాకపోవడం, అశ్రద్ద, అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే నేటికీ దేశప్రజలు ఇన్ని ఇబ్బందులు పడాల్సివస్తోందని, దేశం ఇంతగా వెనకబడిపోయిందని కేసీఆర్‌ అన్నారు. 

మహారాష్ట్రలో కూడా బిఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పధకాలన్నీ అమలుచేస్తామని, రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్‌ అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. తనను మహారాష్ట్రకు రాకుండా ఎవరూ అడ్డుకోలేరని, తరచూ వచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని, తెలంగాణలో అమలవుతున్న పధకాలన్నీ అమలుచేసే వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. 

ప్రజలు తమకే ఓట్లు వేయక తప్పదని కాంగ్రెస్‌, బిజెపిల ధీమా. అందుకే ఇంత ధీమాగా, ప్రజలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కనుక త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు ఓ జలక్ ఇద్దాము. అప్పుడు మీకు నిధులు, పధకాలు ఎందుకు రావో చూద్దాము. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో ప్రతీ గ్రామంలో బిఆర్ఎస్‌ జెండా రెపరెపలాడుతుంది. బిఆర్ఎస్‌ వస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయని నేను హామీ ఇస్తున్నాను,” అని కేసీఆర్‌ అన్నారు.