రేవంత్‌, బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీసులు

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబందమూ లేకపోయినా వారిరువురూ రాజకీయ దురుదేశ్యంతో దీనికంతటికీ తానే కారణమంటూ దుష్ప్రచారం చేస్తూ, తన ప్రతిష్టకు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తునందుకు లీగల్ నోటీసులు పంపిన్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలుపారు. 

ప్రభుత్వానికి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్దంగా ఏర్పడిన టిఎస్‌పీఎస్సీకి మద్య తేడా తెలియని రాజకీయ అజ్ఞానులని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టిఎస్‌పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన కుట్రను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించి, పరీక్షలు నిర్వహించకుండా అడ్డుపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా రాజకీయ కుట్రే అని అన్నారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తున్నామని ప్రకటించినప్పుడూ వారిద్దరూ ఇదేవిదంగా వ్యవహరించిన సంగతిని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. వారిద్దరూ నిరుద్యోగ యువతను రెచ్చగొడుతూ వారి జీవితాలతో ఆడుకొంటున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 

టిఎస్‌పీఎస్సీలో ఈ వ్యవహారం బయటపడగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కటిన చర్యలు తీసుకొంటోందని, భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటోందని కనుక రాష్ట్రంలోని యువత కాంగ్రెస్‌, బిజెపిల మాటలు నమ్మి వారి వెంట వెళ్ళి భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు.