తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు... ఇవ్వము: సుప్రీంకోర్టు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించినట్లే సమాధానం లభించింది. గవర్నర్‌ పదవి కూడా సుప్రీంకోర్టులాగే రాజ్యాంగబద్దమైనది కనుక గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కి నోటీసులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

తెలంగాణ శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదానికి పంపిస్తే వాటిని ఆమె ఆమోదించకుండా తొక్కి పెట్టి ఉంచారని, దాని వలన వాటికి సంబందించి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను అమలుచేయలేకపోతోందని, కనుక తక్షణం వాటిని ఆమోదించవలసిందిగా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. 

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాల, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గవర్నర్‌కు నోటీసు పంపలేమని కానీ అవసరమనుకొంటే ఆమె కార్యదర్శికి లేదా కేంద్రానికి నోటీసు పంపి వివరణ కోరగలమని ధర్మాసనం చెప్పింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరపు హాజరైన న్యాయవాది దుష్యంత్ దవే ఇందుకు అంగీకరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం చెప్పారు. కేంద్రానికి నోటీస్ ఇవ్వనవసరం లేదని ఈ పిటిషన్‌ కాపీ ఇస్తే తాను కేంద్రం అభిప్రాయం తెలుసుకొని కోర్టుకు తెలియజేస్తానని చెప్పడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేస్తూ ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్రం వివరణ సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.