ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సోమవారం ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 10 గంటలసేపు ప్రశ్నించారు. మళ్ళీ ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావలని ఈడీ అధికారులు ఆమెకు సూచించారు. ఈ కేసులో ఆమె పాత్రను ధృవీకరించుకొనేందుకు ఈడీ అధికారులు ఆమెను 14 ప్రశ్నలు అడిగిన్నట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు మార్చి 11న తొలిసారి ఆమె విచారణకు హాజరయ్యారు. మళ్ళీ నిన్న రెండోసారి, నేడు మూడోసారి హాజరుకానున్నారు. ఈడీ విచారణపై ఆమె పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై మార్చి 24న విచారణ జరుగనుంది.
దానిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు విచారణకు హాజరుకాకూడదని మొదట అనుకొన్నప్పటికీ, ఆ విదంగా చేస్తే సుప్రీంకోర్టు ఆమె పిటిషన్పై విచారణ జరిగినప్పుడు ఆమె తమకు సహకరించడంలేదని, ఉద్దేశ్యపూర్వకంగా విచారణకు హాజరుకావడం లేదని ఈడీ వాదిస్తే, సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పవచ్చు. కనుక ఈడీ విచారణకు హాజరవడమే మంచిదని న్యాయ నిపుణులు ఆమెకు సూచించిన్నట్లు తెలుస్తోంది.
అయితే సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ విచారణ చేపట్టేలోగానే ఈడీ విచారణ ముగించి ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఆమె వేసిన పిటిషన్ నిష్ప్రయోజనంగా మారుతుందని చెప్పవచ్చు.