ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తుకి ప్రతిపక్షాల డిమాండ్‌

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో హైదరాబాద్‌ నగరం ఈరోజు దద్దరిల్లిపోతోంది. కాంగ్రెస్‌, బిజెపి, బీఎస్పీ, వైఎస్సార్ టిపిలతో సహా పలు విద్యార్ధి సంఘాలు ఈ ఆందోళనలలో పాల్గొని, టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డిని తక్షణం ఆ పదవిలో నుంచి తొలగించాలని పట్టుబడుతున్నాయి. 

దీనికి తోడు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టిఎస్‌పీఎస్సీ ప్రకటించడంతో పరీక్షకు వ్రాసిన అభ్యర్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ నేతలున్నారని, వారిని కాపాడేందుకే తెలంగాణ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే పోలీసులతో ‘సిట్’ ఏర్పాటు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుక ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నాయి. 

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు కావలసి వస్తుండటంతో, సమర్ధించుకోలేక తీవ్ర ఇబ్బందిపడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కేసు మరో పెద్ద తలనొప్పిగా మారింది. 

సరిగ్గా ఇదే సమయంలో సికింద్రాబాద్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు తెలంగాణ యువతీయువకులు చనిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి ఒకేసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో వీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. 

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నందున బిఆర్ఎస్ కూడా రాజకీయంగానే వాటిని ఎదుర్కొంటోంది. టిఎస్‌పీఎస్సీలో అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించి, అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 

అతను బిజెపి కార్యకర్త అని గుర్తించిన మంత్రి కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు బిజెపియే ఇటువంటి నీచమైన కుట్రలు చేస్తోందని ఆరోపిస్తూ, ఈ కోణంలో దర్యాప్తు చేయవలసిందిగా డిజిపి అంజని కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసి నివేదిక సమర్పించడంతో టిఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

 అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. 

కానీ బిఆర్ఎస్‌ని ఎదుర్కొనేందుకు బలమైన అస్త్రం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ఇవన్నీ గొప్ప ఆయుధాలుగా లభించడంతో వాటితో కేసీఆర్‌ ప్రభుత్వంతో భీకరస్థాయిలో యుద్దం చేస్తున్నాయిప్పుడు. మరి ఈ వేడి ఎన్ని రోజులు ఉంటుందో... ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో? ఎవరు సమిధలుగా మారుతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.