విచారణకు రాలేను: కవిత... రావాల్సిందే: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో  విచారణకు హాజరుకావలసి ఉండగా, ఈరోజు తన ఆరోగ్యం బాగోలేనందున విచారణకు రాలేనని తన న్యాయవాది ద్వారా ఈడీకి తెలియజేశారు. కానీ ఈరోజు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందేనని ఈడీ అధికారులు ఆయనకు తేల్చి చెప్పారు. 

తప్పనిసరిగా విచారణకు రావలసిందే అని ఈడీ చెప్పినందున కల్వకుంట్ల కవిత విచారణకు హాజరవుతారా?ఒకవేళ ఆమె నేడు విచారణకు హాజరుకాకపోతే ఈడీ ఆమెను అరెస్ట్ చేస్తుందా?ఇప్పుడు ఏం జరుగబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఈడీ విచారణ పేరుతో దురుసుగా ప్రవర్తిస్తోందని, సాక్షులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని కల్వకుంట్ల కవిత నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈడీ ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆమె ఆరోపణలకు బలం చేకూరిన్నట్లవుతుంది. పైగా అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. కనుక ఈడీ ఆమెకు మరో రోజు విచారణకు నోటీస్ ఇస్తుందేమో?