
స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మొన్న ఆదివారం జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్ళి మీడియా సమక్షంలో క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజులలో ఆయన మాట మార్చి, నేను ఏ తప్పు చేయలేదు... ఎవరినీ వేధించలేదు” అని చెప్పారు. నల్గొండ జిల్లా కరుణాపురంలో ఫాదర్ కొలోంబో జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రాజయ్య, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నా వయసు 63 సంవత్సరాలు. భార్యా, పిల్లలు అందరూ ఉన్నవాడిని. ఈ వయసులో నేను ఓ మహిళని వేధించానని చెపితే ఎవరైనా నమ్ముతారా? నియోజకవర్గంలో రాజకీయంగా నన్ను ఎదుర్కొలేనివారే మహిళలను అడ్డుపెట్టుకొని నన్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. వారికి దమ్ముంటే ఎన్నికలలో నాపై పోటీ చేసి గెలవాలని సవాలు చేస్తున్నాను. ఫాదర్ కొలోంబో ఆశీర్వాదం వరుసగా 5వ సారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తాను,” అని చెపుతూ కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు.
అంటే రాజయ్య తాను తప్పు చేయకపోయినా సర్పంచ్ నవ్యకు క్షమాపణ చెప్పుకోవలసి వచ్చిందని, పార్టీలో తన ప్రత్యర్ధి(కడియం శ్రీహరి) ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ప్రోద్భలంతోనే సర్పంచ్ నవ్య తనపై ఆరోపణలు చేసిందని రాజయ్య చెపుతున్నట్లు భావించవచ్చు. అంటే పార్టీ అధిష్టానం హెచ్చరించడంతో ఆరోజు సర్పంచ్ నవ్యకు క్షమాపణలు చెప్పానే తప్ప తాను ఏ తప్పు చేయలేదని రాజయ్య చెపుతున్నట్లు స్పష్టం అవుతోంది. మరి దీనిపై నవ్య ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.