టిఎస్‌పీఎస్సీ స్కామ్‌పై నివేదిక పంపించండి

టిఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి 48 గంటలలోగా తనకు సమగ్ర నివేదిక పంపించాల్సిందిగా టిఎస్‌పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్‌ లేఖ వ్రాశారు. ఇది లక్షలాదిమంది నిరుద్యోగ యువత భవిష్యత్‌కు సంబందించిన విషయమని కనుక భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా టిఎస్‌పీఎస్సీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతోందో తెలియజేయాలని కోరారు. అలాగే ఈ కేసులో నిందితులకు కటిన శిక్షలు పడేలా చేసి నిరుద్యోగ అభ్యర్ధులకు టిఎస్‌పీఎస్సీ మీద నమ్మకం కలిగించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నవారిపై చర్యలు తీసుకోకుండా టిఎస్‌పీఎస్సీ ఎదుట ధర్నా చేసిన బిజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారినందరినీ తక్షణం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నయీం కేసు, టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు, డేటా చోరీ కేసులపై సిట్ ఏర్పాటు చేసి ఆ కేసులన్నిటినీ ఏవిదంగా అటకెక్కించేసిందో అందరూ చూశారు. ఇప్పుడు ఈ టిఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును కూడా నీరుగార్చేయడానికే సిట్‌ని ఏర్పాటు చేసిందని భావిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించి దోషులందరికీ శిక్షలు పడేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము,” అని అన్నారు.