హైదరాబాద్, టిఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశ్నాపత్రాలు లీక్ అవడంపై నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి యువమోర్చా (బిజేవైఎం) కార్యకర్తలు టిఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకొని మెరుపు ధర్నా మొదలుపెట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిచడంతో ఇరువర్గాల మద్య తోపులాటలు జరిగాయి. కొందరు బిజేవైఎం కార్యకర్తలు టిఎస్‌పీఎస్సీ కార్యాలయం ప్రధానద్వారంపై నుంచి లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. దొరికినవారిని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. కొందరు బిజేవైఎం కార్యకర్తలు టిఎస్‌పీఎస్సీ కార్యాలయం బోర్డుని విరగ్గొట్టారు.
పోలీసుల విచారణలో ఈ ప్రశ్నాపత్రాల లీక్ సంబందించి అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దీని సూత్రధారి ప్రవీణ్ మొబైల్ ఫోన్‌లో అనేకమంది మహిళల నగ్న ఫోటోలున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ గత ఏడాది అక్టోబర్ 16నా జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా వ్రాసి నూటికి నూరు మార్కులు సాధించిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పోలీసులు ఇంకా ధృవీకరించవలసి ఉంది.
టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన్నట్లు పోలీసులు కూడా ధృవీకరించడంతో ఇప్పటివరకు జరిగిన పలు పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఈ కారణంగా టిఎస్‌పీఎస్సీ అన్ని పరీక్షలను రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు.