రాష్ట్ర అధ్యక్షుడంటే తోపు కాదు: ధర్మపురి అరవింద్

తెలంగాణ బిజెపిలో నాయకుల మద్య కుమ్ములాటలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి నిజమేనని నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధరంపురి అరవింద్ చెప్పేశారు. ఇటీవల బండి సంజయ్‌ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అందుకు బిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం, పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేయడం అందరికీ తెలుసు. ఇప్పుడు బిఆర్ఎస్ కూడా కాస్త చల్లబడిన తర్వాత ధరంపురి అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఆ విషయం ప్రస్తావించడం, ఈ సందర్భంగా బండి సంజయ్‌ని ఉద్దేశ్యించి అన్నమాటలు పార్టీలో విభేదాలకు అద్దంపడుతున్నాయి. 

ధరంపురి అరవింద్ విలేఖరులతో మాట్లాడుతూ, “ బండి సంజయ్‌ వ్యాఖ్యలు నేను సమర్ధించను. అవి ఆయన వ్యక్తిగతం. బిజెపికి వాటితో ఎటువంటి సంబందమూ లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు. కానీ అధ్యక్ష పదవంటే పార్టీలో పవర్ సెంటర్ కాదు. అది కేవలం పార్టీలో కొ ఆర్డినేషన్ సెంటర్ మాత్రమే. ఆయన వాటిని ఉపసంహరించుకొంటే మంచిదని నా అభిప్రాయం,” అని అన్నారు.  

బండి సంజయ్‌ అందరినీ కలుపుకుపోకుండా తానే నాయకుడినని భావిస్తున్నారని ధరంపురి అరవింద్ ఆరోపిస్తున్నట్లే భావించవచ్చు. బండి సంజయ్‌ నాయకత్వాన్ని కూడా ధరంపురి అరవింద్ అంగీకరించడంలేదని స్పష్టమవుతోంది.