
స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించమని అడిగితే తనని ఒంటరిగా వచ్చి కలవమని ఒత్తిడి చేస్తున్నాడని, ఆయన అనుచరులు, వారిలో కొందరు మహిళలు కూడా ఇందుకోసం తనపై ఒత్తిడి చేస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య గత 10 రోజులుగా మీడియాతో మొర పెట్టుకొంటున్నారు.
బహుశః ఈవిషయం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి కూడా వెళ్ళడంతో ఇద్దరికీ చివాట్లు పెట్టిన్నట్లున్నారు. శనివారం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్ళి అక్కడ ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
సర్పంచ్ నవ్య మాట్లాడుతూ, “నేను నిన్న ఓ మాట ఇవాళ్ళ మరో మాట చెప్పేదానిని కాను. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా నిలబడి పోరాడుతానని చెప్పాను. ఇప్పుడూ ఆ మాటకే కట్టుబడి ఉంటాను. పార్టీలో చిన్నా పెద్దా అని తేడా చూడకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఒకరు ఎక్కువా కాదు మరొకరు తక్కువా కాదని అందరూ గ్రహించాలి. నాకు సర్పంచ్‌గా రాజయ్యే అవకాశం కల్పించి ప్రోత్సహించారు. నా గ్రామానికి నిధులు విడుదలవకపోవడం వలన అభివృద్ధి చేసుకోలేకపోతున్నాను. కనుక తక్షణం నిధులు విడుదల చేయాలని రాజయ్యగారిని కోరుతున్నాను. పార్టీలో కొందరి వలన కొన్ని తప్పులు జరిగాయి. కానీ అందరం ఒకే కుటుంబ సభ్యులమని భావించి క్షమిస్తున్నా. మళ్ళీ ఏ మహిళకైనా ఎవరైనా అన్యాయం తలపెడితే వాడిపై కిరోసిన్ పోసి తగులబెడతా... కబ్దదార్... జాగ్రత్త! అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.
ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ, “నేను మహిళలను ఎంతో గౌరవిస్తాను. మొన్న మహిళా దినోత్సవం రోజున అనేక మంది మహిళలని సన్మానించుకొన్నాము. నేను తెలియక చేసిన పని వలన ఎవరికైనా బాధ కలిగితే అందుకు చింతిస్తున్నా. యావత్ మహిళలను క్షమించమని కోరుతున్నా. నేను సిఎం కేసీఆర్‌తో మాట్లాడి ఇక్కడికి వచ్చాను. ఎమ్మెల్యే నిధుల నుంచి జానకీపురం గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నాను,” అని అన్నారు.