బెంగళూరు-మైసూర్ హైవే రేపే ప్రారంభోత్సవం

బెంగళూరు-మైసూర్ నగరాల మద్య రూ.8,478 కోట్లు వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన జాతీయ రహదారి నంబర్: 275ని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. భారతమాల పరియోజన పధకంలో భాగంగా ఆరు లేన్లు, నాలుగు సర్వీసు రోడ్లతో ఈ 118 కిమీ పొడవైన జాతీయ రహదారిని నిర్మించింది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మద్య ప్రయాణ సమయం మూడు గంటలు కాగా అదిప్పుడు గంటన్నర వరకు తగ్గుతుంది. ఇదివరకు జాతీయ రహదారులు నిర్మించేటప్పుడు పరిసర ప్రాంతాలలో పట్టణాలు, గ్రామాల ప్రజలు రాకపోకలకు ప్రత్యేకంగా వంతెనలు, అండర్ పాసులు నిర్మించేవారు కాదు. కానీ గత కొన్నేళ్ళుగా కొత్తగా నిర్మిస్తున్న ప్రతీ జాతీయ రహదారిలో ఎక్కడికక్కడ అవసరమైన చోట అండర్ పాసులు, ఓవర్ పసులు, నిర్మిస్తోంది. దీనిలో మూడా 40 వంతెనలు, 80 అండర్ పాసులు, ఓవర్ పాసులు నిర్మించింది. కనుక ఆయా ప్రాంతాలలో వాహనదారులు, ముఖ్యంగా ఆటో రిక్షాలు, పశువులు ప్రవేశించకుండా ఉంటాయి కనుక ఎంత భారీ వాహనాలైనా దారిలో ఎటువంటి అవరోధాలు లేకుండా వేగంగా దూసుకుపోవచ్చు.  

మరో రెండు మూడు నెలల్లో కర్ణాటక శాసనసభ ఎన్నికల గంట మ్రోగనుంది. కనుక అధికార బిజెపి దీని గురించి ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనే అవకాశం లభిస్తుంది.