పాక్ లో ఉగ్రవాదుల దాడి: 51మంది పోలీసులు మృతి

పాములతో ఆడుకొంటే ఏదో ఒక రోజు వాటి కాటుకి బలికాక తప్పదు. కత్తులతో ఆడుకొంటే వాటికే బలికాక తప్పదు. గన్ సంస్కృతి కావాలనుకొంటే అది ఎప్పుడూ కొన్ని ప్రాణాలు బలిగోరుతుంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినా అలాగే జరుగుతుంది. ఇవన్నీ పదేపదే నిరూపించి చూపబడుతున్న చేదు నిజాలు. మళ్ళీ అటువంటి ఉదాహరణే నిన్న జరిగింది. 

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరనే గొప్ప సిద్దాంతం కనిపెట్టారు. కానీ నేటికీ దానికి భిన్నంగానే వ్యవహరిస్తుంటారు. భారత్ పై పోరాడేవారు కాశ్మీరీ స్వాతంత్ర సమరయోధులుగా, మంచి ఉగ్రవాదులుగా భావిస్తూ వారికి శిక్షణ, రక్షణ, ఆయుధాలు ఇచ్చి భారత్ పైకి పంపిస్తుంటారు. పాకిస్తాన్ లో బాంబు దాడులు చేసేవారిని చెడ్డ ఉగ్రవాదులుగా భావిస్తుంటారు. ఆ చెడ్డ ఉగ్రవాదులే నిన్న బలూచ్ లోని క్వెట్టాలోని పోలీస్ క్యాంప్ పై దాడులు చేశారు. 

అది ఒక పోలీస్ శిక్షణా శిబిరం. గతంలో కూడా దానిపై రెండుసార్లు ఉగ్రవాదులు ఇదేవిధంగా దాడులు చేశారు. ఈసారి దాడిలో చాలా బారీగా ప్రాణ నష్టం జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 51 మంది శిక్షణ పొందుతున్న పోలీసులు మరణించగా, 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈసారి ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు దాడి సంగతి తెలియగానే పాక్ భద్రతాదళాలు అక్కడికి చేరుకొని వారిని గట్టిగా ఎదుర్కొన్నాయి. వారిలో ఇద్దరు కాల్పులు జరుపుతూనే ఆత్మహుతి దాడికి పాల్పడటంతో తీవ్ర ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మూడో ఉగ్రవాదిని కూడా భద్రతాదళాలు మట్టుబెట్టాయి.  

నిన్న రాత్రి ఈ దాడి జరిగిన సమయంలో శిక్షణా శిబిరంలో సుమారు 600 మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వారినందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో భద్రతాదళాలకి చెందిన కొందరు సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. తమ మిలటరీ ఆపరేషన్ పూర్తయినట్లు భద్రతాదళాలు ప్రకటించాయి.