హైదరాబాద్‌లో ఈ మార్గంలో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ నానాటికీ వాహనాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కనుక ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతునందున నేటి నుంచి జూన్ 10 వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. 

కనుక చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్‌ వైపు వెళ్ళే వాహనదారులు సుధా నందిని హోటల్‌ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రెరీ, రోడ్ నెంబర్: 9 మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ మీదుగా ఇందిరాపార్కు వైపు వెళ్ళవలసి ఉంటుంది. 

అలాగే వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా ఇందిరా పార్కువైపు  వెళ్ళే వాహనదారులు హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్ళే వాహనదారులు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. దీనికి మరో ప్రత్యామ్నాయ మార్గం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి రోడ్ నెంబర్: 9, సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చేరుకోవచ్చు.