
నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి అధ్వర్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళలకు చట్ట సభలలో 33% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహారదీక్ష చేస్తారు. ఆమెకు మద్దతుగా మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా దీక్షలో పాల్గొంటున్నారు. కల్వకుంట్ల కవిత గురువారం సాయంత్రం ఢిల్లీలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి తన దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈరోజు ఆయన కూడా వచ్చి ఆమె దీక్షకు మద్దతు పలికారు.
చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయే తప్ప దాని కోసం బిల్లును తీసుకురావడం లేదు. ఈసారి జరుగబోయే పార్లమెంటు సమావేశాలలో మహిళా రిజర్వేషన్స్ బిల్లుని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొన్న ఆమె ప్రజల దృష్టిని దానిపై నుంచి మళ్ళించి ప్రజల సానుభూతి పొందేందుకే ఇప్పుడు హటాత్తుగా మహిళా రిజర్వేషన్లంటూ ఢిల్లీలో హడావుడి చేస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఆరోపిస్తున్నారు.