
చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ భారత్ జాగృతి నేతృత్వంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేప్పట్టబోతున్నారు. ఢిల్లీ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ అక్కడే రేపు తప్పక దీక్ష చేస్తానని పట్టుబడుతున్నారు. అక్కడ ఢిల్లీలో ఆమె దీక్షకు సిద్దమవుతుంటే, ఇక్కడ హైదరాబాద్‌లో బిజెపి ఉపాధ్యక్షురాలు డికె అరుణ నేతృత్వంలో బిజెపి మహిళా నేతలు, కార్యకర్తలు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా దీక్ష చేసేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ రేపు నాంపల్లి వద్ద బిజెపి కార్యాలయం వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపట్టబోతున్నారు. ఈ దీక్షలో బిజెపి ఫైర్ బ్రాండ్ మహిళా నేత విజయశాంతి కూడా పాల్గొంటారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవిత మద్యం వ్యాపారాలు చేస్తూ, లిక్కర్ స్కామ్‌లు చేస్తూ తెలంగాణ పరువు తీసేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించలేనప్పుడు ఢిల్లీలో మహిళల హక్కుల కోసం దీక్షలు చేయడానికి ఆమెకు నైతికహక్కు లేదు. మీరు అక్రమ మద్యం వ్యాపారాలు చేసి అవినీతికి పాల్పడి కేసులలో ఇరుకొంటే, వాటితో తెలంగాణ ప్రజలకు ఏమి సంబంధం? వాటిని తెలంగాణ ఆత్మగౌరవంతో ఎందుకు ముడిపెడుతున్నారు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.