బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడం కోసమే మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలని మా పార్టీ నేతలపై ఉసిగొల్పుతోంది. మా పార్టీలో చాలా మందిపై ఈడీ, సీబీఐ, ఐటి దాడులు చేసి కేసుయిలు నమోదు చేశాయి. ఓసారి మా పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కూడా ప్రయత్నించి భంగపడ్డారు. ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందుగా దర్యాప్తు సంస్థలు ఆ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఇప్పుడు మా పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తూ భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
భారత్ జాగృతి అధ్వర్యంలో ఢిల్లీలో మార్చి 10న దీక్ష చేస్తామని వారం రోజుల క్రితం ప్రకటించాను. వెంటనే మార్చి 9న విచారణకుయి రావాలని ఈడీ నాకు నోటీసులు పంపింది. మహిళలను వారి నివాసంలోనే విచారణ జరపాలనే నిబందన కూడా ఈడీ పాటించడం లేదు. నేను ఏ తప్పు చేయలేదు కనుక ఈడీ నోటీసులకు, విచారణకు నేను భయపడటం లేదు. ఒక్క రోజు సమయం ఇమ్మనమని మాత్రమే అడిగాను. నేను చట్టాన్ని, న్యాయవ్యవస్థలని గౌరవిస్తాను. కనుక తప్పకుండా ఈడీ విచారణకు హాజరవుతాను. నాపై బనాయించిన అక్రమకేసులను నేను న్యాయస్థానంలో ఎదుర్కొంటాను. ధర్మం, న్యాయం నావైపు ఉన్నాయి కనుక నేను భయపడే ప్రసక్తే లేదు,” అని అన్నారు.
రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి అధ్వర్యంలో తల పెట్టిన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడే ఈ సమాచారం అందింది. అయితే ఎట్టి పరిస్థితులలో రేపు దీక్ష చేపడతానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.