శుక్రవారం లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఢిల్లీలో తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే తాను శుక్రవారం ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నందున మర్నాడు హాజరుకాగలనని కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ వ్రాశారు. దానిపై ఈడీ సానుకూలంగా స్పందిస్తూ, శనివారం తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని సూచించింది.
ఇదే కేసులో ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వామి అరుణ్ పిళ్ళైని ఈడీ అధికారులు ఆదివారం రాత్రి ఢిల్లీలో అరెస్ట్ చేసినప్పుడు, ఆయన ఆ కంపెనీలో కల్వకుంట్ల కవితకు బినామీ భాగస్వామి అని, అతని ద్వారా ఆమె ఈ లిక్కర్ స్కామ్‌ను నడిపించి ఢిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం నుంచి ఆర్ధిక ప్రయోజనాలు పొందారని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని నడిపించిన ‘సౌత్ గ్రూప్’లో ఆమె కూడా ప్రధానపాత్రదారి అని ఈడీ పేర్కొంది. కనుక అరుణ్ పిళ్ళైని అరెస్ట్ చేసిన మర్నాడే కల్వకుంట్ల కవితకు నోటీస్ పంపించడంతో ఆమెను అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే బిఆర్ఎస్ మంత్రులు కేంద్ర ప్రభుత్వం, బిజెపిలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నట్లు భావించవచ్చు. ముందుగా అరుణ్ పిళ్ళైతో కలిపి ఆమెని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆ విచారణలో రాబట్టిన వివరాల ఆధారంగా కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయాలా లేదా మరోసారి విచారణకు పిలవాలా? అనేది ఈడీ నిర్ణయించుకొంటుంది.