నానక్‌రామ్‌గూడాలోని కొత్త భవనంలోకి అమెరికన్ కౌన్సిలెట్

హైదరాబాద్‌లో ప్రస్తుతం పైగాప్లాజా వద్ద ఉన్న అమెరికన్ కౌన్సిలెట్ త్వరలో నానక్‌రామ్‌గూడాలో కొత్తగా నిర్మించిన విశాలమైన భవనంలోకి మారబోతోంది. కనుక విహార యాత్రలు, బిజినెస్ టూర్స్, విద్యా, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళాలనుకొనేవారు ఇకపై వీసాల కోసం నానక్‌రామ్‌గూడాలోని ఈ కొత్త కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుంది.

ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పైగాప్లాజా వద్దగల అమెరికన్ కౌన్సిలెట్‌ పనిచేస్తుంది. ఆ తర్వాత లోనికి ఎవరినీ అనుమతించరు. ఆదేరోజు నుంచి అక్కడి కార్యాలయం మూసివేస్తారు. నానక్‌రామ్‌గూడాలోని కొత్త కార్యాలయం మార్చి 20వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. 

అయితే ఈ 5 రోజులలో అత్యవసరంగా అమెరికా వెళ్లవలసినవారు 040-40338300 నంబరుకి ఫోన్‌ చేసి అవసరమైన కౌన్సిలెట్ సేవలు పొందవచ్చు. ఇదేవిదంగా ఈ 5 రోజులలో అత్యవసరంగా అమెరికా వెళ్లవలసిన అమెరికన్ పౌరులు 040-69328000 నంబరుకి ఫోన్‌ చేసి కౌన్సిలెట్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.  

వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావలసినవారు మార్చి 15వరకు పైగాప్లాజా కౌన్సిలెట్ కార్యాలయానికే వెళ్ళాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నుంచి మార్చి 23వరకు వీసా ఇంటర్వ్యూలు నానక్‌రామ్‌గూడా కౌన్సిలెట్ కార్యాలయంలోనే జరుగుతాయి.

అయితే, బయో మెట్రిక్స్ అపాయింట్‌మెంట్స్, డ్రాప్ బాక్స్ అపాయింట్‌మెంట్స్, పాస్‌పోర్ట్ పికప్ సేవలు మాదాపూర్ వద్ద, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌ సమీపంలోగల వీసా అప్లికేషన్ సెంటర్ వద్ద ఈ కార్యాలయం మార్పుతో సంబంధం లేకుండా యధావిధిగా పొందవచ్చని కౌన్సిలెట్ అధికారులు తెలియజేశారు.