కల్వకుంట్ల కవిత తెలంగాణ పరువుతీశారు: బండి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ జారీ చేయడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసి ఆమెకు ఈ కేసుతో ప్రమేయం ఉందని కనుగొన్నారు కనుకనే ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఇందుకు బిఆర్ఎస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. కానీ అందరూ బిజెపిని నిందిస్తూ తమ తప్పు కప్పిపుచ్చుకొంటూ ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఈ కేసుతో సంబందం ఉందని ఈడీ, సీబీఐ సంస్థలు, అనేక పార్టీలు, మీడియా కూడా చెప్పాయి. కనుక ఆమె ధైర్యంగా విచారణకు హాజరయ్యి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలి కానీ మా పార్టీని నిందించి ఏం ప్రయోజనం? ఆమెకు ఈడీ నోటీస్ ఇవ్వడంలో మా పార్టీ ఎటువంటి సంబందమూ లేదు. ఆమెకి ఈడీ నోటీస్ ఇచ్చిందనే విషయం మేము కూడా వార్తలలో చూసి తెలుసుకొన్నాము. 

అయినా తెలంగాణలో కేసీఆర్‌ కూతురు ఒక్కరే మహిళా? కేసీఆర్‌ తనని అవమానిస్తున్నారంటూ పాపం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రోజూ చెప్పుకొని బాధపడుతూనే ఉన్నారు కదా? తనని అవమానించినవారికి కేసీఆర్‌ దండలు వేసి సన్మానాలు చేస్తున్నారని ఆమె మహిళా దినోత్సవం వేడుకలలో కూడా కన్నీరు పెట్టుకొన్నారు పాపం. మహిళా గవర్నర్‌ని గౌరవించని  కేసీఆర్‌ తన కూతురుకి నోటీస్ వచ్చినా ఎందుకు మాట్లాడటం లేదు? కవిత సోదరుడు మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు?

 కల్వకుంట్ల కవిత మద్యం వ్యాపారాలు చేస్తూ, ఈ లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రం పరువు తెలంగాణ మహిళల పరువు తీసేశారు. తెలంగాణ ప్రజలందరూ తన వలన తలదించుకొనేలా చేశారు కదా?” అని అన్నారు.